ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com
గురూజీ

అమృతానంద నాథ

గురువుగారు 1974 సెప్టెంబర్ 19వ తేది వేకువ జామున వినాయక చతుర్థి నాడు  శ్రీమతి కోరిశపాటి హైమావతమ్మ మరియు తిరుపతి రెడ్డి గారి దంపతులకు గౌరవరం గ్రామం, కావలి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించినారు. బాల్యము కౌమారము చాలా ఆనందంగా గడిచిపోయాయి, ద్యాస ఉన్నప్పుడు చదువుతూ మిగతా సమయం అంతా స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడేవారు. చిన్నప్పటి నుండి ధైర్యంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతూ ఉండేవి క్లాసులో లీడర్ గా తరువాత స్కూలు లీడర్ గా ఉంటూ తన స్నేహితులను ముందుకు నడిపించేవారు. స్నేహితులు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయం అంతా ఏకాంతంగా ఉండేదానికే ఆసక్తి చూపించేవారు. అలా ఏకాంతంలో ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టేవి, ఆ ఆలోచనల నుండి తనకు తెలియకుండానే మౌనంలోకి జారుకునేవారు, సమయం ఎంతో తెలియకుండా, ఏ ఆలోచనలు లేకుండా, గంటలు రోజులు గడిచిపోయేవి. తను పెద్దవాడై తనకు గురువు వచ్చిన తరువాతే తెలిసింది ఇదే మౌన ద్యానము అని. పూజలు అవి ఏమి తెలియవు కాని ఎప్పుడూ ఏదో ఒక శక్తి తన వెన్నంటే నడిపిస్తుంది అని ప్రగాఢంగా నమ్మేవారు. ఎప్పుడూ గురువులు గురించి హిమాలయ యోగుల గురించిన సమాచారం ఎక్కువగా అందుతూ వుండేది. తను హైదరాబాదులో ఉన్నప్పుడు తన స్నేహితుడు శ్రీ గురు చరిత్ర పుస్తకం ఇచ్చి పారాయణం చేయి అని సలహా ఇచ్చాడు. శ్రీ గురు చరిత్ర 16 పారాయణాలు అయ్యే సరికి తన జీవితంలోకి గురు ఆగమనం జరిగింది.

శ్రీరామ యోగి గురువుగారు 2006 మాఘపౌర్ణమి రోజున దీక్షను ఇచ్చి మీఊరిలో ఎంతో మంది భగవంతునిలో కలవడానికి  ప్రయత్నించారు కానీ కుదరలేదు, నీకు ఈ క్షణం నుండి అన్నీ ఇస్తున్నాను నీవు ప్రయత్నిస్తావా అని అడిగారు, ప్రయత్నిస్తాను అని గురువు గారికి మాట ఇచ్చారు. అప్పుడు రామయోగి గురువుగారు నీవు వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ పెట్టుకో అన్నదానం చేయి నేను మీ ఇంటికి వస్తాను, నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను అని గురువుగారు చెప్పారు. ఒక రోజు ఆశ్రమంలో గురువుగారు తనను పిలిచి నేను ఉన్నప్పుడే నాకు సమాధి మందిరం ధ్యాన మందిరం కట్టించండి అని చెప్పారు, గురువు గారి ఆశీస్సులతో ప్రారంభించారు. గురువుగారు ఏకాంతంగా ఉన్నప్పుడు రాజయోగ సాధన గురించి ఎన్నో విషయాలు తెలియజేసేవారు,  తన అనుభవాల్ని వివరించేవారు అలా సాధన నిరంతరాయంగా జరుగుతూ వున్నది.  ఒక రోజు గురువుగారు తనను పిలిచి శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలోని "అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా"ఈ శ్లోకాన్ని 3 సార్లు పలికించి, ఆ తల్లిని బయట కాదు నీలోపల చూడు అని చెప్పి, నేను పాసెంజర్ రైలు ఎక్కాను నాకు భగవంతుడిని చేరుకోవడానికి జీవిత కాలం పట్టింది, నీవు ఎక్కేది ఎక్స్ ప్రెస్స్ త్వరగా భగవంతుడిని చేరుతావు,  నీవు చాలా మందిని చేరుస్తావు, జాగ్రత్తగా అందరిని చేర్చు అని ఆశీర్వదించారు. జనవరి 18వ తేది 2011 సం"  శ్రీరామ యోగి గురువుగారు మహా సమాధి చెందారు.

సివిల్ కాంట్రాక్టు వర్క్ కోసం విశాఖపట్నంలోని తన స్నేహితునితో కలిసి ఒడిస్సా పోవాలి, ఒడిస్సా పోవాలి అని ప్రయత్నించిన ప్రతిసారీ విశాఖపట్నం పోయే సరికి ప్రయాణం 15 లేదా 20 రోజులు వాయిదా పడేది, అలా రెండు మూడు సార్లు జరిగింది. ఈసారి 3 రోజులు మాత్రమే వాయిదా పడింది, తిరిగి వెనక్కి రాలేక అక్కడే లాడ్జి తీసుకొని ఉన్నారు. ఏమీ తోయక తన స్నేహితునితో కలిసి పక్కనే ఉన్న దేవీపురం బయలుదేరారు. దేవీపురంలోని సహస్రాక్షి అమ్మవారిని శ్రీచక్ర రూపంలో ఉన్న గుడిని దర్శనం చేసుకొని పూజ అయిన తరువాత అక్కడ ఉన్న పూజారి పక్కనే కొండఫైన కామాఖ్య దేవి స్వయంభువుగా వెలిసి ఉంది దర్శనం చేసుకుని బయలుదేరండి అని చెప్పారు. తీరా వారు వెళ్ళే సరికే ప్రకృతమ్మగారు గుడిని మూసుకుని వస్తూవున్నారు. అక్కడ టెంకాయలు అమ్మే అవ్వ ప్రకృతమ్మతో వీరు అమ్మ దర్శనంకోసం చాలా దూరం నుండి వచ్చారు ఇంతలోనే మీరు గుడి మూసుకుని వస్తున్నారు అని అవ్వ చెప్పిన వెంటనే ప్రకృతమ్మగారు రండి వెళ్ళదాం అని వారిని గుడి వైపు తీసుకొని వెళ్ళింది. కామాఖ్య గుడి తలుపులు తీసిలోపలకు వెళ్ళగానే ఒక్కసారిగా శరీరం తేలికగా అయిపోయింది, కాళ్ళు నిలబడేస్థాయిలో లేవు, ఒళ్ళంతా తడసిపోయింది, నోరు ఎండిపోయింది, కళ్ళు మూసుకునిపోతున్నాయి, ఒక ఐదు నిముషాలు ఏమీ తెలియలేదు, చిన్నగా కళ్ళు తెరచే సరికి ఎన్నో గంటలు నిద్రపోయి లేచినట్లు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది, నోటి నుండి మాటలు కూడా రావటంలేదు. ఇలా కొన్ని నిమిషాలు తరువాత ప్రకృతమ్మతో నాలోపల చాలా అనందంగా ఎంతో ప్రశాంతంగా ఉంది మాట్లాడలేక పోతున్నాను. నేను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అస్సాంలోని కామాఖ శక్తి పీఠంకి వెళ్దామని అనుకున్నాను కానీ ఏవో కొన్ని కారణాలవలన వెళ్ళలేక పోయాను అంతా సిద్దం చేసుకున్నాను ఆఖరి నిమిషంలో ప్రయాణం ఆగిపోయింది. "నేను ఇక్కడ ఉన్నాను అంత దూరం ఎందుకు" అని ఆ తల్లి చెప్పినట్లు అనిపిస్తుంది అని ఆమెతో అన్నారు. అప్పుడు ప్రకృతమ్మగారు ఇక్కడ కామాఖ్య అమ్మవారు స్వయంభువుగా వెలి సారు, మేము ఇక్కడ అందరినీ అమ్మ యోని పీఠంపై కూర్చోపెట్టి పూజ చేస్తాము మీరు చేయించుకోండి మీరు అమ్మ ప్రేమను అనుభూతి చెందుతారు అన్నారు. ఇప్పుడు కుదరదు మేము ఒడిస్సా వెళ్ళాలి ఈ సారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయించుకుంటాము అని అన్నారు. అప్పుడు ఆవిడ ఏడు రోజులు వరసగా చేయించుకోండి అని ఇంకా ఎన్నో సాధనకు సంబంధించిన విషయాలు చర్చించారు, మీరు తప్పకుండా రండి అని పదే పదే చెపుతున్నారు. గురువుగారు కూడా విశాఖపట్నంలోనే ఉన్నారు మీరు తప్పకుండా గురువుగారిని కలవండి, మీరు తప్పకుండా వచ్చి ఈ పూజ చేయించుకోండి అని చెప్పారు మేము తప్పకుండా గురూజిని కలిసిన తరువాత వచ్చి పూజ చేయించుకుంటాము అని చెప్పి అక్కడ నుండి విశాఖపట్నం బయలుదేరారు.

శ్రీ అమృతానంద నాథ సరస్వతి గురువు గారి పాదపద్మలకు నమస్కారము చేసుకుని దేవీపురం వెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని వచ్చాము అని చెప్పారు, గురువుగారు ఆశీర్వదించి కామాఖ్యలో పూజ చేయించుకున్నారా అని అడిగారు, లేదు గురువుగారు ఈసారి వచ్చినప్పుడు చేయించుకుంటాము అని చెప్పి శ్రీరామ యోగి గురువుగారి ఆశ్రమం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.  బయలుదేరేటప్పుడు మరలా చెప్పారు దేవీపురం వెళ్ళి పూజ చేయించుకోండి అని. లాడ్జి కి వెళ్ళే సరికి తెలిసింది ప్రయాణం ఇంకో 3 రోజులు వాయిదా పడింది అని. ఇంక సమయం వృధా చేయకూడదు అని వెంటనే దేవీపురం బయలుదేరారు. దేవీపురంలో రూము తీసుకుని కామాఖ్యలో పూజ చేయించుకోవడం ప్రారంభించారు, మూడు రోజుల తరువాత విశాఖపట్నం బయలుదేరారు. మరలా 2 రోజులు వాయిదా పడింది తిరిగి మరలా దేవీపురం బయలుదేరారు, మరలా కామాఖ్యలో పూజ, అలా ఐదు రోజులు పూర్తి అయ్యాయి తరువాత విశాఖపట్నం బయలుదేరారు. లాడ్జి కి వెళ్ళే సరికి తెలిసింది ప్రయాణం ఇంకో వారం రోజులు వాయిదా పడింది అని, తిరిగి మరలా దేవీపురం బయలుదేరారు, మరలా కామాఖ్యలో పూజ, అలా గురువుగారు చెప్పినట్లే  ఏడు రోజులు పూర్తి అయ్యాయి. ఇంక వారు విశాఖపట్నం వెళ్ళడం మానుకొని ఇంటి కి వెళ్దాము అని నిర్ణయించుకొని సహస్రాక్షి అమ్మని దర్శించుకొని కామాఖ్యా గుడికి వెళ్ళే సరికి ప్రకృతమ్మగారు ఎదురుచూస్తున్నారు, గురువుగారు వచ్చారు మీగురించి అడిగారు, మీకు ఇష్టం అయితే మీకు గురువుగారు దీక్ష ఇస్తారు అని చెప్పారు. ఇలాంటి అవకాశం వదులుకోవద్దు సాక్షాత్ గురువే దీక్ష ఇస్తాను అని చెప్పారు. గురువుగారు ఆశ్రమం దగ్గర ఉన్నారు వెంటనే కలవండి అని చెప్పింది, గురువుగారి పాద పద్మములకు నమస్కారం చేసుకొని పాదముల వద్ద కూర్చున్నారు. అప్పుడు గురువుగారు నీకు ఇష్టం అయితే దీక్ష ఇస్తాను అని చెప్పారు, నాకు ఏమీ తెలియవు అమ్మని ఎలా పూజించాలో కూడా తెలియదు అని చెప్పారు దానికి గురూజీ అన్నీ నేను నేర్పిస్తాను అని చెప్పారు. అలా అమ్మ వారి  జీవితంలోకి దీక్ష రూపంలో ప్రవేశించింది.

2012 శరన్నవరాత్రి మొదటి రోజు గురువుగారు శ్రీ విద్యా దీక్షని ప్రసాదించారు. అన్నీ క్రమాలు నేర్పించారు. అలా సాధన ప్రారంభం అయింది రోజురోజుకు ధ్యాస పెరుగుతూ వస్తుంది ప్రతీ నెల గురువుగారి దర్శనానికి వెళ్ళడం, వెళ్ళిన ప్రతీ సారి ఎన్నో మెళకువలు తెలియజేసేవారు. 2013 ఫిబ్రవరి 20వ తారీఖు పైన గురువుగారి దర్శనానికి దేవీపురం వెళ్ళారు. తెలిసినవారి కొడుకు పెళ్ళి దేవీపురంలో జరగడం వలన తిరుగు ప్రయాణం వాయిదా పడింది, రాత్రి 2:20 నిమిషాలకి శరీరం అంతా వణికి పోతుంది శక్తి ప్రవాహం  చాలా ఎక్కువగా వస్తుంది శరీరం తట్టుకోలేనంతగా వస్తుంది. 

ఒక్కసారిగా అమ్మ మాట వినిపించింది.

"నీ పేరు ను మారుస్తున్నాను"

అమృత.........అని పిలిచింది.

గంటా గంటన్నర సేపు శరీరం అదుపులో లేదు, ఎంత ప్రయత్నించిన అదుపుచేయలేక పోయారు. అప్పుడు తన స్నేహితునికి ఫోన్ చేయడానికి కూడా చేతులు సహకరించడం లేదు చాలా కష్టపడి చేసారు. ఈ విషయం అంతావిని చాలా ఆనందపడ్డారు, నీకు సాక్షాత్ అమ్మే పూర్ణ దీక్ష ఇచ్చింది, అదీ ఇదీ అని ఏదేదో అనందంగా చెపుతున్నాడు కానీ ఇక్కడ ఆనందించే పరిస్థితిలో లేరు. ఆ శక్తిని తట్టుకోలేక శరీరం వణికిపోతుంది. మీరు ఈ విషయాన్ని వీలైనంత త్వరగా గురూజీకి తెలియజేయండి, నేను లోపల చెప్పుకుంటూనే వున్నాను, మీరు కూడా గురూజీకి తెలియజేయండి అని చెప్పారు తన స్నేహితునికి. ఈ విషయం గురూజీకి చెప్పడానికి రెండు రోజులు పట్టింది ఎప్పుడు గురూజీ దగ్గరకు వెళ్ళినా ఎవరో ఒకరు ఉండేవారు వాళ్ళ ముందు చెప్పలేక ఏమనుకుంటారో అని సిగ్గు వలన ఏకాంతంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. సూరత్ నుండి తన స్నేహితుడు గురువుగారికి ఫోన్ చేసి మీకు ఏదో చెప్పాలని మా స్నేహితుడు రెండు రోజుల నుండి ఎదురుచూస్తున్నారు అని చెప్పాడు. గురువుగారు చిరునవ్వు నవ్వుతూ బయటకు వచ్చి అమ్మ ఏమి చెప్పింది అని అడిగారు, అంతా చెప్పి ఇది భ్రమా లేక నిజమా అని అడిగారు, అప్పుడు గురువుగారు,"అమ్మ నీకు నాపేరే పెట్టింది". దీన్ని పూర్తిగా తీసుకో అంటే పూర్తిగా స్వీకరించు అన్నారు. గురూజీ నాకు తృప్తిగా లేదు అమ్మ ఇవ్వడం వలన, ఇదే మీరు మొదట పిలవండి అప్పుడు నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పారు.

అప్పుడు గురువుగారు 

"అమృతా......." అని  3 సార్లు పిలిచారు.

హృదయం ఆనందంతో ఉప్పొంగి తేలిపోతూ ఏదో కొత్త అనుభూతికి లోనయ్యాను. అప్పటి నుండి అప్పుడప్పుడూ అమ్మతో తాదాత్మ్యం చెందుతూ ఉండేవాడు. ఇదే స్థితి రోజురోజుకు పెరుగుతూ వచ్చి మౌనంలోకి దారితీసింది. మౌనం అనగా మాట్లాడకుండా ఉండటం కాదు, మనం మాట్లాడుతున్నా లేక ఏపని చేస్తున్నా లోపల మౌనంగా ఉండడం. ఇదే మౌన సాధన.

"ఒకరిని ఒకరు కలుపుకొని ముందుకు నడవండి, ఈ లోకం అమృత నిలయం అవుతుంది".

గురూజీ

శ్రీరామ యోగి గురువుగారు

త్వరలో....