రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య)
ఆ: స రి2 మ1 ప ద1 ని2 స
అవ: స ని2 ప మ1 రి2 స
తాళం: ఆది
పల్లవి
అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ॥ (2.5)
చరణం 1
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము । (2)
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ॥ (1.5)
అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ॥ (1.5)
చరణం 2
చెంగట నల్లదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము । (2)
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ॥(1.5)
అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ॥ (1.5)
చరణం 3
కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది । (2)
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ॥ (1.5)
అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ॥ (2.5)