కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు ॥
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ।
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥
అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు ।
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ॥
కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద గరు-
ణించి తన యెడకు రప్పించిన వాడు ।
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ॥