రాగం: అమృతవర్షిణి
ఆ: స గ3 మ2 ప ని3 స
అవ: స ని3 ప మ2 గ3 స
తాళం: ఆది
పల్లవి
అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2.5)
చరణం 1
నారదుండు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము । (2)
కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2)
అన్ని మంత్రములు నిందే ఆవహించెను (1.5)
చరణం 2
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపియించె
నంగ వింవె కృష్ణ మంత్ర మర్జునుండును । (2)
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ॥ (2)
అన్ని మంత్రములు నిందే ఆవహించెను (1.5)
చరణం 3
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరా నాధుండె గురి
పన్నిన దిదియె పర బ్రహ్మ మంత్రము । (2)
నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము ॥ (2)
అన్ని మంత్రములు నిందే ఆవహించెను (2.5)