షోడశ కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥

అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె సర్వ
నిలయునకు ఆసనము నెమ్మినిదే ।
అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ॥

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణములివే ।
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ॥

అమృతమథనునకు నదివో నైవేద్యము
రవిజంద్రనేత్రునకు కప్పురవిడెము ।
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో ॥