001 ॥ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ ।
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ॥
అద్వ్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ ।
అంబా! త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥
భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను.
యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి, హృదయము ద్రవించి,
002 ॥ న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥ (01:32)
స్వజనమును చంపుటకు ఇష్టపడక “నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు” అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,
003 ॥ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ (02:11)
దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.
004 ॥ దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ॥ (02:13)
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుకు ఈ విషయమున ధీరులు మోహము నొందరు.
005 ॥ వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ॥ (02:22)
మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో, అట్లే, ఆత్మ – జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.
006 ॥ నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ॥ (02:23)
ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.
007 ॥ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ॥ (02:27)
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.
008 ॥ హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥ (02:37)
యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా, యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము.
009 ॥ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ॥ (02:47)
కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను చేయుట మానరాదు.
010 ॥ దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ (02:56)
దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును, రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.
011 ॥ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్-సంజాయతే కామః కామాత్-క్రోధోభిజాయతే ॥ (02:62)
క్రోధాద్-భవతి సమ్మోహః సమ్మోహాత్-స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్-బుద్ధినాశో బుద్ధినాశాత్-ప్రణశ్యతి ॥ (02:63)
విషయ వాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.
012 ॥ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥ (02:72)
ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.
013 ॥ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ॥ (03:03)
అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.
014 ॥ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ (03:14)
అన్నమువలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.
015 ॥ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥ (03:16)
పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలనాచరించుచునే యుండవలెను.
016 ॥ యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ (03:21)
ఉత్తములు అయినవారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.
017 ॥ మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥ (03:30)
అర్జునా! నీవొనర్చు సమస్త కర్మలనూ నాయందు సమర్పించి, జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై, సంతాపమును వదలి యుద్ధమును చేయుము.
018 ॥ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ (03:35)
చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.
019 ॥ ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ॥ (03:38)
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లే కామముచేత జ్ఞానము కప్పబడియున్నది.
020 ॥ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ (04:07)
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ (04:08)
ఏ కాలమున ధరమమునకు హాని కలుగునో, అధరమము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మసంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.
021 ॥ వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥ (04:10)
అనురాగమూ, భయమూ, క్రోధమూ వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగముచేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
022 ॥ యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ ।
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ (04:11)
ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని, ఏ ఒక్కనియందును అనురాగము కాని, ద్వేషము కాని లేదు.
023 ॥ యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ॥ (04:19)
ఎవరి కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితుడని విద్వాంసులు పల్కుదురు.
024 ॥ బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ॥ (04:24)
యజ్ఞపాత్రము బ్రహ్మము. హోమద్రవ్యము బ్రహ్మము. అగ్ని బ్రహ్మము. హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధిచేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.
025 ॥ శ్రద్ధావాన్ల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ॥ (04:39)
శ్రద్ధ, ఇంద్రియనిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
ఇది భగవద్గీత యందు బ్రహ్మవిద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములు సమాప్తము.
————-
026 ॥ సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ॥ (05:02)
కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపానములు. అందు కర్మ పరిత్యాగము కన్న కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది.
027 ॥ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ॥ (05:10)
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక, బ్రహ్మార్పణముగా కర్మలనాచరించునో, అతడు తామరాకున నీటిబిందువులు అన్టని రీతిగా పాపమున చిక్కుబడడు.
028 ॥ జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ॥ (05:16)
ఎవని అజ్ఞానము జ్ఞానముచేత నశింపబడునో, అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి, పరమార్థ తత్వమును చూపును.
029 ॥ విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ॥ (05:18)
విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందునూ, శునకమూ, శునకమామ్సము వండుకొని తినువానియందునూ పండితులు సమదృష్టి కలిగియుందురు.
030 ॥ శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ॥ (05:23)
దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిష్డ్వర్గముల జయించునో, అట్టివాడు యోగి అనబడును.
031 ॥ యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః ।
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ॥ (05:28)
ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి, మనస్సునూ, బుద్ధినీ స్వాధీనమొనర్చుకొని మోక్షాసక్తుడై ఉండునో, అట్టివాడే ముక్తుడనబడును.
032 ॥ భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ ।
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ॥ (05:29)
సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగనూ, సకల ప్రపంచ నియామకునిగనూ నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.
033 ॥ యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ॥ (06:02)
అర్జునా! సన్యాసమని దేనినదురో, దానినే కర్మయోగమనియూ అందురు. అట్టి యెడ సంకల్పత్యాగ మొనర్పనివాడు యోగి కాజాలడు.
034 ॥ యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ (06:17)
యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసమ్యమన యోగము లభ్యము.
035 ॥ యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ॥ (06:19)
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే, మనో నిగ్రహముకల్గి, ఆత్మయోగ మభ్యసించినవాని చిత్తము నిశ్చలముగా నుండును.
036 ॥ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ (06:29)
సకల భూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తన యందునూ, తనను అన్ని భూతములయందునూ చూచుచుండును.
037 ॥ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ (06:35)
అర్జునా! ఎట్టివానికైననూ మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయిననూ, దానిని అభ్యాస, వైరాగ్యములచేత నిరోధింపవచ్చును.
038 ॥ యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా ।
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ (06:47)
అర్జునా! పరిపూర్ణ విశ్వాసముతో నన్నాశ్రయించి, వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.
039 ॥ మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ (07:03)
వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొర్’అకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసు కొనగలుగుచున్నాడు.
040 ॥ భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥ (07:04)
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన బేధములతో ఒప్పి యున్నదని గ్రహింపుము.
041 ॥ మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ (07:07)
అర్జునా! నా కన్న గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని మరేదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు యీ జగమంతయూ నాయందు నిక్షిప్తమై ఉన్నది.
042 ॥ పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ (07:09)
భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెల్ల భూతములయందు ఆయువు, తపస్వులయందు తపస్సు నేనుగా నెరుగుము.
043 ॥ దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ॥ (07:14)
పార్థా! త్రిగుణాత్మకము, దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింప రానిది. కాని, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.
044 ॥ చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥ (07:16)
ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు.
045 ॥ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ (07:19)
జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట, విజ్ఞానియై నన్ను శరణము నొందుచున్నాడు.
046 ॥ అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ ।
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ॥ (08:05)
ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.
047 ॥ అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ॥ (08:08)
కవిం పురాణమనుశాసితారం
అణోరణీయంసమనుస్మరేద్యః ।
సర్వస్య ధాతారమచింత్యరూపం
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ॥ (08:09)
అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు; పురాణ పురుషుడు; ప్రపంచమునకు శిక్షకుడు; అణువు కన్నా అణువు; అనూహ్యమైన రూపము కలవాడు; సూర్య కాంతి తేజోమయుడు; అజ్ఞానాంధకారమునకన్న ఇతరుడు.
048 ॥ అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ॥ (08:21)
ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.
049 ॥ శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే ।
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః ॥ (08:26)
జగత్తునందు శుక్ల కృష్ణము లనెడి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దానివలన పునర్జన్మము కలుగు చున్నవి.
050 ॥ వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ ।
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ॥ (08:28)
యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక, ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందగలడు.
051 ॥ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ ।
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ॥ (09:07)
పార్థా! ప్రళయకాలమున సకల ప్రాణులును నా యందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులనూ నేనే సృష్టించు చున్నాను.
052 ॥ అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ (09:22)
ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించు చుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించు చున్నాను.
053 ॥ పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ॥ (09:26)
ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదక మైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడో, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
054 ॥ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ॥ (09:34)
పార్థా! నా యందు మనస్సు లగ్నము చేసి యెల్ల కాలములయందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు.
ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన కర్మసన్యాస, ఆత్మసంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజ విద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.
———–
055 ॥ మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ (10:06)
కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందలి సమస్త భూతములును జన్మించెను.
056 ॥ మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥ (10:09)
పండితులు నాయందు చిత్తముగలవారై నా యందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొంచు బ్రహ్మా నందమును అనుభవించుచున్నారు.
057 ॥ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ॥ (10:20)
సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను.
058 ॥ వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ (10:22)
వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.
059 ॥ ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥ (10:30)
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
060 ॥ యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్ ॥ (10:41)
లోకమునందు ఐశ్వర్య యుక్తమై, పరాక్రమ యుక్తమై, కాంతి యుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగము వలననే సంప్రాప్తమగును.
061 ॥ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ॥ (11:05)
పార్థా! దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై అనేక విశేషములగు నా సస్వరూపమును కన్నులారా దర్శింపుము.
062 ॥ పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ ।
బ్రహ్మాణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ॥ (11:15)
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోనంతరూపమ్ ।
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ (11:16)
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని ।
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ॥ (11:25)
దేవా! ఎల్ల దేవతలూ, ఎల్ల ప్రాణులూ, బ్రహ్మాదులూ, ఋషీశ్వరులూ, వాసుకీ మొదలగుగా గల సర్పములూ నీయందు నాకు గోచరమగుచున్నవి.
ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లైయూ నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింప జాల కున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నాయందు దయ యుంచి నాకు ప్రసన్నుడవు గమ్ము. కృష్ణా! ప్రసన్నుడవు గమ్ము.
అర్జునా!
063 ॥ కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాంసమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే
యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥ (11:32)
అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్ఠమైన కాల స్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్ననూ – బ్రతుక గలవారిందెవ్వరునూ లేరు.
064 ॥ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ॥ (11:34)
ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాధి యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శతృ వీరులను నీవు సంహరింపుము.
065 ॥ కిరీటినం గదినం చక్రహస్తమ్ ।
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ ।
తేనైవ రూపేణ చతుర్భుజేన ।
సహస్రబాహో భవ విశ్వమూర్తే ॥ (11:46)
అనేక భుజములుగల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరు చున్నాను కృష్ణా!
066 ॥ సుదుర్దర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ॥ (11:52)
అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.
067 ॥ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః (12:02)
ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్ర్ద్ధాభక్తులతో నన్ను ధ్యానించు చున్నారో, అట్టివారు అత్యంతమూ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
068 ॥ శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్-ధ్యానం విశిష్యతే ।
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ॥ (12:12)
అభ్యాసయోగముకన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మ ఫలత్యాగమూ శ్రేష్ఠము. అట్టి త్యాగమువల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సన్భవించుచున్నది.
069 ॥ అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః ।
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ॥ (12:16)
ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫ్ల త్యాగియై నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.
070 ॥ సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః ।
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ॥ (12:18)
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ ।
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ॥ (12:19)
శత్రుమిత్రులయందును, మానావ మానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు కలవాడై, నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
071 ॥ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ (13:02)
అర్జునా! దేహము క్షేత్రమనియూ, దేహమునెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియూ పెద్దలు చెప్పుదురు.
072 ॥ అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ ।
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా ॥ (13:12)
ఆత్మ జ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మౌక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములనైయూ, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియూ చెప్పబడును.
073 ॥ కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ॥ (13:21)
ప్రకృతిని “మాయ” యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండును.
074 ॥ సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ ।
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥ (13:28)
శరీరము నశించిననూ తాను సశింపక యెవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే యెరిగినవాడు.
075 ॥ అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే ॥ (13:32)
అర్జునా! గుణ నాశన రహితుడైనవాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంత ర్గతుడయ్యునూ కర్మల నాచరించువాడు కాడు.
076 ॥ యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ (13:34)
పార్థా! సూర్యుడొక్కడే యెల్ల జగత్తులనూ ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగనే క్షేత్రజ్ఞుడు యెల్ల దేహములనూ ప్రకాశింపజేయుచున్నాడు.
ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము.
———-
077 ॥ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ ।
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ॥ (14:01)
జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్ష్మును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను.
078 ॥ సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥ (14:04)
అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వన్టిది. నేను తండ్రి వన్టివాడను.
079 ॥ తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ॥ (14:06)
అర్జునా! త్రిగుణములలో సత్త్వగుణము నిర్మలమగుటన్జేసి సుఖ జ్ఞానాభి లాషలచేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది.
080 ॥ రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ ।
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ॥ (14:07)
ఓ కౌంతేయా! రజోగుణము కోరికలయందు అభిమానమూ, అనురాగమూ పుట్టించి ఆత్మను బంధించుచున్నది.
081 ॥ తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ॥ (14:08)
అర్జునా! అజ్ఞానమువలన పుట్టునది తమోగుణము. అది సర్వ ప్రాణులనూ మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ, అజాగ్రత్తతోనూ, నిద్ర తోనూ బద్ధుని చేయును.
082 ॥ మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ (14:25)
మానావ మానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
083 ॥ ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ (15:01)
బ్రహ్మమే మూలముగా, నికృష్ణమైన అహంకారము కొమ్మలుగాగల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్ష్మునకు వేదములు ఆకులువన్టివి. అట్టి దాని నెరింగినవాడే వేదార్థ సార మెరింగినవాడు.
084 ॥ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ॥ (15:06)
పునరావృత్తి రహితమైన మోక్షపథము, సూర్య చంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
085 ॥ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥ (15:14)
దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.
086 ॥ తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ॥ (16:03)
దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ॥ (16:04)
పార్థా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట, మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే, దంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశ సంభూతులకుండును.
087 ॥ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ॥ (16:21)
కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలి వేయ వలయును.
088 ॥ యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥ (16:23)
శాస్త్ర విషయముల ననుసరింపక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించువాడు సుఖ సిద్ధులను పొందజాలడు. పరమపదము నందజాలడు.
089 ॥ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ॥ (17:02)
జీవులకు గల శ్రద్ధ పూర్వ జన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్త్వికము, తామసములని మూడు విధములగా ఉన్నది.
090 ॥ యజంతే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ॥ (17:04)
సత్త్వగుణులు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధా భక్తులతో పూజించుదురు.
091 ॥ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥ (17:15)
ఇతరుల మనస్సుల నొప్పింపనిదియూ, ప్రియమూ, హితములతో కూడిన సత్య భాషణమూ, వేదాధ్యన మొనర్చుట వాచక తపస్సని చెప్పబడును.
092 ॥ కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥ (18:02)
జ్యోతిష్ఠోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియూ, కర్మఫలము
యీశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియూ పెద్దలు చెప్పుదురు.
093 ॥ అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్ ॥ (18:12)
కర్మఫలములు ప్రియములూ, అప్రియములూ, ప్రియాతిప్రియములూ అని మూడు విధములు. కర్మఫలమునలు కోరినవారు జన్మాంతరమందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాల కున్నారు.
094 ॥ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥ (18:30)
అర్జునా! కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధ మోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్త్వగుణ సముద్భవమని ఎరుగుము.
095 ॥ ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి ।
భ్రామయంసర్వభూతాని యంత్రారూఢాని మాయయా ॥ (18:61)
ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమందున్నవాడై, జంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.
096 ॥ సర్వధర్మాంపరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష్యయిష్యామి మా శుచః ॥ (18:66)
సమస్త కర్మలను నాకర్పించి, నన్నే శరణు బొందిన, ఎల్ల పాపములనుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
097 ॥ య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ (18:68)
ఎవడు పరమోత్కృష్టమైన, పరమ రహస్యమైన యీ గీతాశాస్త్రమును నా భక్తుల కుపదేశము చేయుచున్నాడో, వాడు మోక్షమున కర్హుడు.
098 ॥ కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసంమోహః ప్రనష్టస్తే ధనంజయ ॥ (18:72)
ధనన్జయా! పరమ గోప్యమైన యీ గీతా శాస్త్రమును చక్కగా విన్టివా? నీ యజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?
కృష్ణా!
099 ॥ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥ (18:73)
అచ్యుతా! నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.
100 ॥ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ (18:78)
యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు యెచటనుందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతియుండును.
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ ।
విష్ణొః పదమవాప్నోతి భయ శోకాది వర్జితః ॥
గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయ శోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.
ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్షసన్యాస యోగములు సర్వమూ సమాప్తము.
ఓం సర్వేజనాః సుఖినో భవంతు
సమస్త సన్మగళాని భవంతు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః