రాజసభ, రఘు రామసభ
సీతా కాంత కల్యాణ సభ ।
అరిషడ్వర్గములరయు సభ
పరమపదంబును ఒసగు సభ ॥ (రాజసభ)

వేదాంతులకే జ్ఞాన సభ
విప్రవరులకే దాన సభ ।
దుర్జనులకు విరోధి సభ
సజ్జనులకు సంతోష సభ ॥ (రాజసభ)

సురలు, అసురులు కొలచు సభ
అమరులు, రుద్రులు పొగడు సభ ।
వెరువక హరివిల్లు విరచు సభ
జనకుని మది మెప్పించు సభ ॥ (రాజసభ)

భక్తి జ్ఞానములొసగు సభ
సృష్టి రహితులై నిలచు సభ ।
ఉత్తమ పురుషుల ముక్తి సభ
చిత్త విశ్రాంతినొసగు సభ ॥ (రాజసభ)

గం-ధర్వులు గానము చేయు సభ
రం-భాదులు నాట్యములాడు సభ ।
పుష్ప వర్షములు కురియు సభ
పూజ్యులైన మునులుండు సభ ॥ (రాజసభ)