ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com

శ్రీ లలితా త్రిపుర సుందరి

హయగ్రీవా! భోగ మోక్షాలను ఏకకాలంలో ప్రసాదించగలిగిన లలితా మాత ఆవిర్భావం గురించి తెలియజేయండి అని అగస్త్య మహర్షి ప్రార్ధించాడు

అగస్త్యా! పూర్వం దక్షుని కుమార్తెయగు సతీదేవి శివున్ని వివాహం చేసుకున్న అనంతరం దక్ష యజ్ఞంలో శివునికి జరిగిన పరాభవానికి సతీదేవి తనలోని యోగాగ్నిని ప్రజ్వలింపజేసి తనకుతానుగా తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్రఆగ్రహానికి లోనై వీరభధ్రున్ని సృష్టించి దక్ష యజ్ఞాన్ని ద్వంసంచేశాడు, తరువాత తీవ్రవైరాగ్యంతో తపమాచరించి చాలా సంవత్సరాలు సమాధి స్థితిలో లీనమయినాడు. మరల సతి హిమవంతుని కూతురిగా జన్మించింది.  సాక్షాత్ ఆదిపరాశక్తిని కూతురిగా పొందావు అని నారద మహర్షి హిమవంతునికి తెలియజేసి తపస్సులో వున్న శివునికి సపర్యలు చేసేలా ఒప్పిస్తాడు. మరోవైపు తారకాసురుని అకృత్యాలు తీవ్రమై దేవతలను బాధిస్తున్నాడు, అతని హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా, ఆయన, "శివునికి పార్వతికి కలిగే కుమారుడు మాత్రమే ఆ అసురుడ్ని సంహరించగలడు”, మీరందరు వెళ్ళి శివునికి పార్వతికి కళ్యాణం చేసేప్రయత్నాలు మొదలుపెట్టండి అని చెప్పాడు.  పార్వతి శివునికి సేవచేయు సమయంలో ఇంద్రుని ఆజ్ఞ మేరకు మన్మధుడు శివునిపై తన మన్మధబాణాలను సంధించాడు శివుని మనస్సు కొంచెం చలించింది దీనికి కారణం తెలుసుకున్న శివుడు కోపోగ్రుడై తన మూడవ కంటిని తెరిచి మన్మధున్ని భస్మంచేశాడు. రుద్రగణాల నాయకులలో ఒకరైన చిత్రకర్మ అను “గణపతి” మన్మదుని భస్మంతో బొమ్మనుచేసి శివునికి చూపించడానికి శివుని దగ్గరకు వెళ్ళేసరికి బొమ్మకి ప్రాణం వచ్చి భండాసురుడు అవుతాడు. మిగతా భస్మంలో నుండి భండాసురుని అనుచరులైన విశుక్రుడు, విషంగుడు పుట్టుకొచ్చారు, వీరితో పాటు కోట్లాది అసురులు ఆ భస్మం నుండే ఉద్భవించారు. భండాసురుడు పెరిగి పెద్దవాడై మహా బలవంతుడౌతాడు, రాక్షసగురువైన శుక్రాచార్యుని సహాయంతో మహేంద్ర పర్వతాల మీద శోణితపురం(శూన్యక పట్టణం) అనే నగరాన్ని నిర్మించి శివుని వరప్రసాదం వల్ల రాజౌతాడు. భండాసురుడు తన అనుచరులైన విశుక్రుడు, విషంగుణ్ని పిలిచి సభ ఏర్పాటుచేసి,"మనము దేవతలను గెలవాలంటే చాలా కష్టం". మీరందరు వాయురూపంలో మారి దేవతల శరీరాలని ఆవహించి వాళ్ళను మన ఆధీనంలోకి తెచ్చుకొని కృశింపచేసి అంతం చేద్దాం. తక్షణమే ముల్లోకాలలోని జీవుల శరీరంలోకి మనం చేరుదాం, ఆందరిని అంతం చేద్దాం అని ప్రయాణమయ్యారు. త్రిమూర్తులతో సహా దేవతలందరి మనస్సులలో ప్రవేశించి వారి మానసిక శక్తిని, మోహాలను హరించివేశారు. మిగతా లోకాల పరిస్థితీ అలాగే వుంది. సృష్టి పూర్తిగా ఆగిపోయింది వారి శక్తి క్షీణించసాగింది. విశుక్రుడు భూలోకంలో, విషంగుడు రసాతలంలో ఇదే విధంగా భాదలకు గురిచేస్తున్నారు. ఈ పరిణామాలకు ఆందోళనచెందిన దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు, బ్రహ్మ అందరిని విష్ణువు వద్దకు తీసుకొనివెళ్ళి మొరపెట్టుకుంటారు. ఆయన, ఈ సమస్య నుండి బయటవేసేవారు ఒక్కరే ఉన్నారు. ఆయనే "మహాశంభు".

 

వీరందరు ఈ బ్రహ్మాండం ఆవతలికివెళ్ళి మహాశంభు ను ప్రార్దన చేయగానే ఆయన ప్రత్యక్షం అయ్యి వీరి భాదలను విచారించి, మీ సమస్యలు తీరాలి అంటే ఏన్నో బ్రహ్మాండాలు ఆవతల ఉన్న లలితాదేవి మాత్రమే మిమ్మలిని రక్షించగలదు. ఆమెను మీరు ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞం చేయాలి అది ఎలా చేయాలో వివరించాడు, దానికి దేవతలు మీరే యజ్ఞహోతగా ఉండి మమ్మలిని ముందుకు నడిపించండి అని వేడుకోగా మహాశంభువు వారి కోరికను మన్నించి ఒప్పుకున్నాడు. ఈక్రతువంతా భండాసురుడుకి తెలియకుండా జరగాలని నారాయణుడు మహామాయను సృష్టించి "నీవు భండాసురున్ని మోహంలో వుంచి విషయ సుఖాలలో మునిగిపోయేలా చేయి" అని ఆజ్ఞాపించాడు. తన శక్తితో సప్తసముద్రాలని ఇంకింపజేసి హోమకుండాన్ని ఏర్పాటుచేసి చిదగ్ని రగిలింపజేసి వేదమంత్రాలతో యజ్ఞం ప్రారంభించారు. అగ్ని ఉవ్వెత్తున ఎగసి ఆకాశాన్ని తాకుతున్నది. దేవతలందరు తన దేహాన్ని తనకు తానుగా యజ్ఞానికి ఆహుతులుగా సమర్పించుకున్నారు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది.చిదగ్నికుండం నుండి కోటిసూర్యుల కాంతితో దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతూ శ్రీచక్రరధబిందుస్థానంలో సింహాసనంపై చతుర్బాహువులలో పాశ, అంకుశ, పుష్పబాణ,చాపములతో ఉదయిస్తున్న సూర్యుని ఛాయలో నిత్యయవ్వనంతో పదహారు సంవత్సరముల ప్రాయంలో దగదగ మెరిసిపోతూ అపురూప లావణ్యంతో లలితాదేవి ప్రత్యక్షమైనది. సమస్త దేవతలను హోమకుండం నుండి జీవింపజేసింది. ఆనందంతో పరాశక్తిని బ్రహ్మాది దేవతలు స్తుతించారు. లలితాదేవి హృదయం నుండి బాలా త్రిపుర సుందరి, జ్ఞానం నుండి రాజ శ్యామల, క్రియాశక్తి నుండి వారాహీ ఉద్భవించారు. అంకుశం నుండి సంపత్కరీ ఉద్భవించి రణకోలాహం అనే మధించిన గజాన్ని అధిరోహించి ఉంటుంది, పాశం నుండి అశ్వారూఢా ఉద్భవించి అపరాజిత అను అశ్వాన్ని అధిరోహించి ఉంటుంది. హూంకారం నుండి చతుఃషష్టికోటి యోగినీ దేవతలు మరియు భైరవులు ఉద్భవించారు. లలితాదేవి సింహాసనాన్ని అధిరోహించే సమయం ఆసన్నమైనది ఇంక వివాహం చేయాలి అని బ్రహ్మ తలచేలోపే పరమేశ్వరుడు తన రూపం మార్చి మహా కామేశ్వరుని రూపంలో ప్రత్యక్షమైనాడు. లలితాదేవికి తగిన వరుడు మహా కామేశ్వరుడే అని తెలిసి పరాశక్తి ముందు దేవతలు స్తోత్రం చేశారు. అప్పుడు ఇరువురు ఒకరిని ఒకరు చూసుకొని ఆకర్షితులైనారు, లలితా దేవి తన చేతిలోని మాలను ఆకాశం వైపు విసిరేసింది ఆ మాలపోయి మహా కామేశ్వరుని మెడలో పడింది. దేవతల హాహాకారాల మద్య బ్రహ్మ, విష్ణువులు మహాకామేశ్వరికామేశ్వరులకు వివాహం జరిపించారు.

దేవతలు చెరుకువిల్లును, విష్ణువు పుష్పబాణాలను, వరుణుడు పాశాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని, అగ్ని కిరీటాన్ని, సూర్యుడు కర్ణాభరణాల్ని, కుబేరుడు చింతామణిని, లక్ష్మీదేవి చత్రాన్ని, చంద్రుడు వింజామరలను, బ్రహ్మ కుసుమాకరం అను విమానాన్ని మహాకామేశ్వరికామేశ్వరులకు బహుకరించారు. పరాశక్తి అయిన మహాకామేశ్వరి కామేశ్వరునితోకూడి సృష్టి ప్రారంభించింది. పూర్తిగా సైన్యం సన్నద్దం అయ్యింది.  చతుర్భాహువులలో ధనుస్సు బాణాలు పాశం అంకుశం ధరించి లలితాదేవి శ్రీచక్రాన్ని అధిరోహించి వస్తూవుంటే బ్రహ్మాది దేవతలు స్తోత్రగానం చేస్తూవుంటే దేవతా స్త్రీలు సంగీతవాయిద్యాలు వాయిస్తూ కోలాహలంగా బయలుదేరారు. లలితాదేవికి కుడి ప్రక్కన శ్రీ రాజ శ్యామలాదేవి ఏడు అంతస్తుల గేయచక్ర రధాన్ని అధిరోహించి బయలుదేరింది. ఎడమ ప్రక్కన శ్రీ మహా వారాహీ ఐదు అంతస్తుల కిరిచక్ర రధాన్ని అధిరోహించి బయలుదేరింది. ముందు అశ్వారూఢా "అపరాజిత" అన్న అశ్వాన్ని అధిరోహించి అశ్వబలగాన్ని నడిపిస్తుంది. వెనుకాల సంపత్కరీ "రణకోలాహలం" అనే మధగజాన్ని అధిరోహించి గజబలగాన్ని వెనుకనుండి నడిపిస్తుంది. శ్యామలాదేవికి తన వేలిఉంగరాన్ని తొడిగి తన రాజ్యానికి మంత్రిణిగా ప్రకటించినది. ఈవిడే ఇక్కడ మంత్రిగాను, దశమహావిద్యలలో 9వ విద్య మాతంగి మహావిద్యగాను ప్రకటితమవుతూఉంటుంది. గేయచక్రానికి ఏడు ఆవరణలు ఉంటాయి. శ్యామలాదేవి తన ఆవరణదేవతలతోటి మనల్ని ఎల్లవేళలా పాలిస్తూఉంటుంది. వారాహిదేవికి లలితాదేవి తన ఆజ్ణాచక్రం నుండి హలము, ముసలం ఆయుధాలను ప్రసాదించి సైన్యాద్యక్షురాలిగా ప్రకటించింది. అమ్మవారి క్రియాశక్తే వారాహి దేవి.

యుద్దం ప్రారంభమైనది, భండాసురుడు తన సేనలతో లలితాదేవిని ప్రాణాలతో బంధించి తీసుకొని రండి అని అజ్ఞాపించాడు. దుర్మదుడు తన సైన్యంతో సంపత్కరీ ఎదుర్కొని సంపత్కరీ కిరీటంలోని వజ్రపురాయిని పడగొడతాడు, దానికి కోపించిన సంపత్కరీ దుర్మదుడుని సంహరిస్తుంది. కురండకుడు సంపత్కరీ సైన్యంలోని చండీదేవి చేతిలో మరణిస్తాడు. దీనికి ఉగ్రుడైన భండాసురుడు 100 అక్షౌణీల సైన్యాన్ని ఐదుగురు సైన్యాధిపతులకు ఇచ్చి యుద్దానికి పంపిస్తాడు. కరంకుడు తన పరివారంతో యుద్దంలోకి దిగుతూనే తన మాయతో సర్పసైన్యాన్ని సృష్టించి శక్తి సేనలపై ప్రయోగిస్తాడు. నకులేశ్వరిదేవి తన ముంగీస సైన్యంతో ఐదుగురు సేనాపతుల్ని వారి సైన్యాన్ని సంహరిస్తుంది. లలితాదేవి సైన్యం ముందు పటిష్టంగా వుంది వెనుకాల సైనం తక్కువగా వుంది అని వేగుల ద్వారా పసికట్టిన భండాసురుడు వెనుకవైపు నుండి దాడిచేయండి అజ్ఞాపిస్తాడు, విషంగుడు వెనుకాల వైపునుండి విపాటవమనే ఆయుధంతో హఠాత్తుగా దడిచేయడం వలన లలితాదేవి విజామర విరిగిపోతుంది, ముందువైపు నుండి కుటిలాక్షుడు ఏకకాలంలో యుద్దం చేయసాగారు. ఇది గమనించిన కామేశ్వరిదేవి మొదలగు దేవతలు కోపోద్రేకులై లలితాదేవిని సమీపించి, వహ్నివాసిని జ్వాలామాలిని అను నిత్యదేవతలు స్వయంప్రకాశ శక్తి కలదని వారు తమ ప్రకాశాన్ని ప్రదర్శిస్తే చికటిలో ఉన్న రాక్షసులు వెలుగులోకి వస్తారు అని విన్నవించుకుంటారు, అమ్మవారి అనుమతితో వహ్నివాసిని జ్వాలామాలిని అగ్నిగుండాలవలె వెలిగిపోయారు దీని పలితంగా రాక్షసులందరు వెలుగులోకి వస్తారు, వీరి సైన్యాన్ని లలితాదేవి షోడశనిత్య శక్తులు హతమారుస్తాయి వీరి వలన గాయపడిన విషంగుడు పారిపోతాడు, ఇది గమనించిన కుటిలాక్షుడు కూడా యుద్దరంగం నుండి పారిపోతాడు. ఇలాంటి పొరపాటు మరలా జరగకుండా శ్యామలదేవి వారాహిదేవి తమ సైన్యన్ని పటిష్టం చేస్తారు. లలితాదేవి, జ్వాలామాలినిదేవినితో, "పుత్రీ నీవు అగ్ని స్వరూపురాలివి"  కావున నీవు మన సైన్యం చుట్టూతా రక్షణగా గొప్ప అగ్ని ప్రాకారాన్ని ఏర్పాటుచేయి, అమ్మ అజ్ఞతో అగ్ని ప్రాకారం ఏర్పాటు అయింది. భండాసురుడు ఈ వ్యూహాన్ని భగ్నం చేయడానికి తన 30మంది కొడుకులను యుద్దానికి పంపిస్తాడు. భండాసురుని పుత్రులు యుద్దరంగంలో దిగారని తెలిసిన బాలా త్రిపుర సుందరి  తను వారిని ఎదుర్కొటాను అనుమతి ఇవ్వమని తల్లిని ప్రాదేయపడింది, మొదట తల్లి వద్దని వారించినా తరువాత తన పుత్రిక ఉత్సాహాన్ని కాదనలేక  సమ్మతించినది. బాలా కర్ణి అనే నూరు హంసలు లాగుతున్న రధాన్ని అదిరోహించింది. శ్యమలా, వారాహి అంగరక్షకులుగా నిలబడ్డారు, యుద్దభూమికి బయలుదేరింది బాలాదేవి భండపుత్రులతో చేయు అతిభయంకరమైనన పోరాటం చూసి అందరు ఆశ్చర్యపోయారు. బాలాదేవి 30 మందీ భండపుత్రులను ఏకకాలంలో సంహరించింది. బిడ్డ పోరాటనికి మురిసిపోయిన తల్లి ఆనందంతో కౌగిలించుకున్నది.

భండాసురుడు విశుక్రుడ్ని జయవిఘ్న యంత్రాన్ని శత్రుస్తావరంలో స్థాపించమని ఆదేశిస్తాడు. విశుక్రుడు శత్రుస్తావరం వైపు బయలుదేరాడు జయవిఘ్న యంత్రాన్ని రచించి ఆయంత్రాన్ని శత్రుస్తావరం పై విసిరిచెస్తాడు. ఆ యంత్ర ప్రభావం వల్ల శక్తి సేనలలో అలసత్వం ఏర్పడుతుంది వారిలో వారు వాదించుకుంటూ మనం ఎందుకు యుద్దం చేయాలి, ఈవిడ ఏవరు మనపై పెత్తనం చేయడానికి, ఈ విదమైన ఒకరకమైన అజ్ఞానపు మత్తు వారిని కమ్మేసింది. కాని ఈ యంత్ర ప్రభావం శ్యామలా వారాహిదేవిని ఏమీ చేయలేకపోతుంది, శక్తి సేనల పరిస్తితిని గమనించిన  వీరు లలితాదేవి వద్ద విన్నవించుకుటారు, అప్పుడు మహా కామేశ్వరీ అయిన శ్రీలలితాదేవి మహా కామేశ్వరుని వంక ప్రేమతో చిరునవ్వు నవ్వుతూ చూసింది, ఇరువురి చూపులు ఒకరిలోఒకరు లయమైన ఆ ఆనంద సమయంలో ఆ చిరునవ్వుల మద్య మహాతేజస్సుతో ఒక కాంతి పుంజం ఆవిర్బవించింది. ఆ కాంతి పుంజం చిన్నగా ఒక దివ్యాకృతిని దరించి శ్రీవల్లభగణపతిగా ఆవిర్బవించినాడు.   తల్లి ఆజ్ఞమేరకు "జయవిఘ్నశిలాయంత్రము" ను ద్వంసం చేశాడు, శక్తి సేనలు అలసత్వాన్ని, మాయానిద్రను వీడి యుద్దనికి సన్నద్దం అవుతారు. మహాగణపతి తన గణములతో శక్తి సేనలతో కూడి విశుక్రునిపైకి యుద్దనికి బయలుదేరాడు, విశుక్రుడు గజాసురుడ్ని మహాగణపతిపైకి యుద్దనికి పంపుతాడు, మహాగణపతి గజాసురుడ్ని చంపడంచూసి విశుక్రుడు యుద్దరంగం నుండి పారిపోతాడు.

-సశేషం